వైకాపా మంత్రులకు రాష్ట్ర భవిష్యత్తుపై ఆలోచన ఉందా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి(TDP leader Gorantla) నిలదీశారు. ఏ శాఖలో నైనా పురోభివృద్ధి సాధించారా? అని ప్రశ్నించారు. కేవలం బూతులు తిట్టేందుకే సమయం వెచ్చిస్తున్నారని ఆరోపించారు. అసమర్థ నాయకుడు పాలన చేస్తున్నాడని ట్విట్టర్లో దుయ్యబట్టారు. బాహుబలి కలెక్షన్స్‌పై విచారణ జరిపిస్తామని సజ్జల అంటుంటే... ప్రజలు మాత్రం వివేకా హత్య, ఇసుక మట్టి కలెక్షన్స్, ఆడ పిల్లలపై అత్యాచారాలు గురించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని మరో ట్వీట్ చేశారు.
మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన మంత్రి పేర్ని నాని, సినీ నటుడు పోసాని కృష్ణమురళీలపై నిర్భయ చట్టం 509 సెక్షన్ కింద కేసులు పెట్టాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత(Telugu woman state president Vangalapudi Anita) డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడబిడ్డల పేర్లు వాడుకోవటం సిగ్గు చేటన్నారు. మంత్రి పేర్ని నాని, పోసానిలు మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. మహిళల్ని అసభ్యపదజాలంతో మంత్రులు దూషిస్తుంటే.. ముఖ్యమంత్రి సంగీత విభావరిలా భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. మహిళల్ని కించపరుస్తున్న తీరుని ఖండించకపోతే వైకాపా పేటీఎం గ్రామసింహాలు రోడ్లపైకి వచ్చి అందరిపైనా మొరుగుతాయని ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఈ గ్రామ సింహాలకు స్క్రిప్ట్ అందుతోందా? అని ప్రశ్నించారు. వైద్యుడు సుధాకర్ మృతికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్న అనిత... ముఖ్యమంత్రిని ఏ1 ముద్దాయిగా సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చాలని కోరారు.