ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Agitation: రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఏర్పడిన గుంతల వద్ద తెదేపా నేతల ఆందోళన - రోడ్లపై ఏర్పడిన గుంతల వద్ద తెదేపా నేతల ఆందోళన వార్తలు

రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కనీసం మరమ్మతులు కూడా చేయించట్లేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఒక్క కొత్త రోడ్డయినా వేసిందా అని ప్రశ్నించారు. కొన్నిచోట్ల రహదారులపైనే వరినాట్లు వేసి నిరసన తెలపగా.. పలు చోట్ల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.

tdp leaders agitation over damaged roads
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఏర్పడిన గుంతల వద్ద తెదేపా నేతల ఆందోళన

By

Published : Jul 24, 2021, 9:14 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై ఏర్పడిన గుంతల వద్ద తెదేపా నేతల ఆందోళన

రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్థంగా మారాయంటూ తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరిట అభివృద్ధిని విస్మరించారని.. గుంటూరులో తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తెదేపా హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదని దుయ్యబట్టారు. అధికారంలో గోతులు తీసే నాయకులు ఉండి.. రహదారులకు పడిన గుంతలు పూడ్చటం లేదని గుంటూరులో మాజీమంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని.. కృష్ణా జిల్లా కైకలూరులో తెదేపా నేతలు ఆందోళన చేశారు. వీరులపాడు మండలం జూజ్జురులో రోడ్లపై గుంతలను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమ, నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే సౌమ్య, శ్రీరాంను పోలీసులు అడ్డుకుని.. పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా.. తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతలోనే వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని.. తెదేపా నేతలు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి

పశ్చిమగోదావరి జిల్లా చింతపూడి మండలం రామచంద్రపురంలో అధ్వానంగా మారిన రహదారులకు స్వచ్ఛందంగా మరమ్మతు చేస్తున్న తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్లన్నీ చేపలు, రొయ్యలు చెరువుల మాదిరిగా మారాయని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. రెండేళ్లుగా రోడ్లపై మరమ్మతులు కూడా చేయని.. ప్రభుత్వాన్ని గద్దెదించాలంటూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో తెదేపా శ్రేణులు నినదించారు. జగన్ పాలనలో అవినీతి సంతలే.. రోడ్లంతా గుంతలే అంటూ.. చేపట్టిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో శ్రేణులు పాల్గొన్నారు. ఒంగోలు నుంచి కర్నూలు వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్థంగా ఉందని.. తెదేపా నేతలు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

సీఎం అభివృద్ధి అనే పదాన్ని మరిచారు

జగన్‌ మాయమాటలు చెప్పి సీఎం కుర్చీ ఎక్కారని.. విజయనగరంలో తెదేపా నేతలు ఆరోపించారు. అభివృద్ధి అనే పదాన్ని సీఎం జగన్‌ మరిచారని దుయ్యబట్టారు. సాలూరులో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యాని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణించాలంటే.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో తెదేపా నేతలు విమర్శించారు.

రోడ్లకు మరమ్మతులు చేసిన తెదేపా నేతలు

రాయలసీమలోనూ తెదేపా నేతలు ఆందోళనలు చేశారు. కర్నూలులోని బుధవారపేటలో గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేసే పనులను తెదేపా శ్రేణులు ప్రారంభించారు. ఆదోని, కౌతాళంలో రహదారిపై నిలిచిన వర్షపు నీటిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో రోడ్లకు తెదేపా నేతలు మరమ్మతు చేపించారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు మడుగుని తలపిస్తున్నాయని.. అనంతపురం జిల్లా పెనుకొండలో సీపీఎం ఆధ్వర్యంలో.. రోడ్లపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి ఆందోళన చేశారు.


ఇదీ చదవండి:

నీట మునిగిన సంగమేశ్వర ఆలయం.. ఆలయ పూజారి శిఖర పూజలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details