రాష్ట్రంలో సారా, గుట్కా, ఖైనీ, గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోందని... స్పీకర్ తమ్మినేని కొత్తగా కళ్లు తెరిచినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెదేపా నేత యరపతినేని శ్రీనివాస్ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. లిక్కర్ మాఫియాలో ఎవరున్నారో స్పీకర్ బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దొరక్క నిర్మాణ రంగం ఆగిపోతే... వైకాపా నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వేల కోట్లు ఆర్జిస్తున్నారని చెప్పారు.
కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిఘా వ్యవస్థ ఏమయ్యిందని ప్రశ్నించారు. కరోనా బారిన పడిన వారికి కనీసం నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడంలేదని ఆగ్రహించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టైనా సరే అక్రమంగా సంపాదించుకోవటమే వైకాపా ధ్యేయమని ఆయన దుయ్యబట్టారు.