అప్పులకు గ్యారంటీ అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన.. రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా నేత యనమల(yanamala) రామకృష్ణుడు అన్నారు.. అప్పులకు గ్యారంటీ అవసరంతోపాటు కేంద్ర అనుమతి అక్కరలేదనడం దుర్మార్గం అన్నారు. ఏ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్నా.. గ్యారంటీ ఇవ్వాల్సిందేనన్నారు. ఆర్టికల్ 293(3) ప్రకారం బడ్జెట్ అప్పులకు కేంద్ర అనుమతి తప్పనిసరితోపాటు ఎఫ్ఆర్బీఎం పరిధి 3శాతం దాటకూడదని స్పష్టం చేశారు. 2శాతం అదనపు రుణాల కోసం కేంద్రం షరతులతో అనుమతిచ్చింది వాస్తవమో కాదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యారంటీ అవసరమే లేదనుకుంటే ఎస్క్రో ఒప్పందం ఎందుకు చేసుకున్నారని నిలదీశారు. ఇష్టానుసారం ఖర్చులతో ఆర్థిక సంక్షోభం సృష్టించిన సీఎం జగన్.. రాష్ట్రం దివాలా తీసే స్థితికి తెచ్చారని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
"కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్ర ఆదాయంలో 90శాతం మించరాదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనల పక్కకు పెట్టి అప్పులకు గ్యారంటీలు ఇచ్చింది. మార్కెట్ రుణాల కంటే ఆఫ్ బడ్జెట్ రుణాలు ఎక్కువగా చేసింది." అని విమర్శించారు.
అది పెద్ద తప్పిదమే..
2019-20లో రూ.77,700 కోట్లు, 2020-21లో రూ.91,000 కోట్ల బడ్జెట్ రుణాల గురించి కేంద్ర ప్రభుత్వానికి చెప్పకపోవడం పెద్ద తప్పిదమని యనమల మండిపడ్డారు. సంక్షేమానికి ఆఫ్ బడ్జెట్ రుణాలు ఖర్చు చేస్తే, కార్పొరేషన్ రుణాలను ఎలా రికవరీ చేస్తారు. కార్పొరేషన్లు రుణాలు తీర్చకపోతే ఆ భారం ప్రభుత్వంపైనే పడుతుందన్నారు.. సంక్షేమానికి చేసిన ఖర్చును ఆర్థికాభివృద్ధిలోకి ఎలా వస్తుందని నిలధీశారు.