ఆరు నెలలకోసారైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనతో ఆ ఒక్కరోజూ అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు(TDP leader Yanamala Ramakrishnudu Fire on YCP Rulling) అన్నారు. ఒక్క రోజు సమావేశంతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఆర్డినెన్సులను ప్రవేశపెట్టి, ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌కు మరే ఇతర రాష్ట్రాలకు లేని కోవిడ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వానికే వర్తిస్తున్నాయా అని ప్రశ్నించారు. కనీసం 15రోజులైనా సమావేశాలు నిర్వహించి, ప్రజాసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని యనమల డిమాండ్ చేశారు.
వైకాపా పాలనలో రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీశారని యనమల మండిపడ్డారు. జగన్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల సమాజంలోని ప్రతి వర్గం ఇబ్బంది పడుతోందని ఆక్షేపించారు. రాష్ట్రానికి అప్పులు కూడా దొరకని విధంగా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో ఉన్న 10.22శాతం వృద్ధి రేటు ఇప్పుడు -2.8శాతానికి పడిపోయిందని, రాష్ట్ర ఆదాయం పెంచకుండా వసూళ్లకు పాల్పడుతున్నారని యనమల అన్నారు. అసెంబ్లీలో మీడియాను నియంత్రించడం తగదని హితవు పలికారు.