Yanamala Ramakrishnudu: అపరిపక్వ, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన సీఎం జగన్.. పదవీచ్యుతుడు కావడం ఖాయమని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంత్రివర్గాన్ని మార్చుకునే హక్కు, అధికారం ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ.. అందరినీ మార్చేయడం వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగం ఉండదన్నారు. ధరల మంట, విద్యుత్ కోతలు, ఆర్థిక సంక్షోభం, సహజ వనరుల దోపిడీ, దౌర్జన్యాలు, అక్రమ కేసులు లాంటి ప్రజా సమస్యల పరిష్కరానికి ఎంతమాత్రం దోహదం చేయదన్నారు.
అవినీతి ఊబిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వం ఇప్పటికే పతనం అంచున ఉందని.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ లాంటివి ఈ పరిస్థితిని మార్చలేవని యనమల అన్నారు. కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు, మరికొందరిపై క్రిమినల్ కేసులు ఉన్నందున రాజీనామాలు కోరుతున్నారా అని యనమల నిలదీశారు. పదవీచ్యుతులైన మంత్రులు అసభ్య భాషతో చెలరేగిపోయినా సీఎంను సంతృప్తిపరచలేకపోయారని.. కొత్త మంత్రివర్గ సభ్యుల నుంచి మరింత అసహ్యకర పదజాలాన్ని జగన్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.