ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Yanamala: అప్పుల ఊబిలో రాష్ట్రం.. అలా చేస్తేనే గట్టెక్కేది! - యనమల తాజా వార్తలు

రాష్ట్రం క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. మూలధన వ్యయం కంటే చెల్లిస్తున్న అప్పులే ఎక్కువగా ఉన్నాయన్నారు. రెండేళ్ల వైకాపా పాలనలో రూ. 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని దుయ్యబట్టారు. నేటి ఆర్థిక పరిస్థితి నుంచి రాష్ట్రం గట్టెక్కాలంటే వైకాపా నేతలు లూటీ, దుబారా తగ్గించి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని చెప్పారు.

అప్పుల ఊబిలో రాష్ట్రం..అలా చేస్తేనే గట్టెక్కేది !
అప్పుల ఊబిలో రాష్ట్రం..అలా చేస్తేనే గట్టెక్కేది !

By

Published : Aug 28, 2021, 4:44 PM IST

Updated : Aug 29, 2021, 4:48 AM IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోందని.. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రెండేళ్లలోనే రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా.. అభివృద్ది, సంక్షేమం శూన్యమని అన్నారు. 2019-20లో వైకాపా ప్రభుత్వం 57 సార్లు ఓవర్‌ డ్రాప్ట్‌కు వెళ్లిందని.. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మూలధన వ్యయం కన్నా చెల్లిస్తున్న అప్పుల రీ-పేమెంటే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. జగన్‌ తన రెండేళ్ల పాలనలో పారిశ్రామిక రంగంలో 5.2, సేవల రంగంలో 7.04, తలసరి ఆదాయంలో 6.6, జీడీపీలో 6.2 శాతం నెగెటివ్‌ గ్రోత్‌ రేట్​లతో రాష్ట్ర ఆర్థికవృద్ధిని భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు.

2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌, మే నెలల్లో 22,427.76 కోట్లు అప్పులు చేశారని యనమల విమర్శించారు. 2018-19లో 13,899.07 కోట్ల రెవెన్యూ లోటు 2020-21లో 35.540.44 కోట్లకు చేరుకుందన్నారు. అన్ని రంగాల్లో జీరో అభివృద్ధి నమోదవటంతో పాటు.. నిరుద్యోగం 15 శాతానికి చేరిందని ఆరోపించారు. అదే సమయంలో నేరాలు - ఘోరాల్లో జగన్‌ వంద శాతం వృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు. జగన్‌ అనుభవ రాహిత్యం, అహంభావం, కక్షసాధింపు విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. తెదేపా ప్రభుత్వం హయంలో రెవెన్యూ రాబడులు తక్కువగా ఉన్నా.. వైకాపా కన్నా ఎక్కువ సంక్షేమం చేసిందని గుర్తు చేశారు.

నేటి ఆర్ధిక పరిస్థితి నుంచి రాష్ట్రం గట్టెక్కాలంటే వైకాపా నేతలు లూటీ, దుబారా తగ్గించి ఆదాయాన్ని పెంచాలి. అమరావతిలో నిరర్ధకం చేసిన 2 లక్షల కోట్ల ఆస్తులను ఉపయోగంలోకి తేవాలి. రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన 10 లక్షల కోట్ల పెట్టుబడులు తిరిగి తీసుకురా వాలి. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఆస్తులను రప్పించాలి" - యనమల రామకృష్ణుడు, మండలిలో ప్రతిపక్ష నేత

బాధ్యతారాహిత్య పాలన, అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని యనమల మండిపడ్డారు. దూర దృష్టి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక చక్ర బంధంలో ఆంధ్రప్రదేశ్‌ చిక్కుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి వంటి ప్రాజెక్టులను సక్రమంగా కొనసాగించి ఉంటే.. 13 జిల్లాల అభివృద్ధికి నిధులు సమకూరేవని యనమల స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తే సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ధరలు, పన్నులు తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని యనమల డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

TDP protest: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెదేపా నిరసనలు

Last Updated : Aug 29, 2021, 4:48 AM IST

ABOUT THE AUTHOR

...view details