ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫోన్ ట్యాపింగ్​పై.. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు షాక్​కు గురిచేశాయి: లోకేశ్

ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసి, ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా తుంగలో తొక్కేందుకు స్వేచ్ఛనిచ్చే ఫాసిస్టు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారుతోందని తెదేపా నేత నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీమంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డెడ్​గా చెప్పటం షాక్​కు గురిచేసిందని అన్నారు.

By

Published : May 11, 2022, 5:31 PM IST

Updated : May 11, 2022, 7:50 PM IST

మాజీమంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డెడ్​గా చెప్పటం షాక్​కు గురిచేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తెదేపా నేతలపై కక్ష సాధించేందుకు వైకాపా చట్టాలు, రాజ్యాంగాన్ని సైతం విస్మరిస్తోందన్నది మరోసారి బహిర్గతమైందన్నారు. ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా తుంగలో తొక్కేందుకు స్వేచ్ఛనిచ్చే ఫాసిస్టు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారుతోందని ఆక్షేపించారు. ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైకాపా ఓవర్ టైమ్ పని చేస్తుండటం సిగ్గుచేటన్నారు.

ప్రభుత్వం నేరపూరిత చర్యకు పాల్పడింది: ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని వెల్లడించారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా ఇతర తెదేపా ముఖ్యనేతల ఫోన్లు ఎప్పటి నుంచి ట్యాప్ చేస్తున్నారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ తన మూడేళ్ల పాలనలో ఎంతమంది నేతల వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూశారో, ఎందరి ఫోన్లు ట్యాప్ చేశారో బహిర్గతం చేయాలన్నారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తివాస్తవాలతో ముఖ్యమంత్రి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నేరపూరితమైన ఫోన్ ట్యాపింగ్​పై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీలను వర్ల డిమాండ్ చేశారు.

పెద్దిరెడ్డి ఏమన్నారంటే..:పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేసి నిజమైన బాధ్యులను అరెస్టు చేశారన్నారు. లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యా సంస్థల్లోనే జరిగినట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసి ఉండొచ్చని వెల్లడించారు. మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడా ప్రశ్నపత్రాలు లీకవ్వలేదని ప్రకటించారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'అదే మంత్రి 60 మందిని అరెస్టు చేయించారుగా.. అయినా విచారణ పూర్తయ్యేదాకా ఎవరైనా విలేకరుల ముందుకొచ్చి పేపర్‌ లీకైందని.. ఇంత మందిని అరెస్టు చేశామని చెబుతారా ?' అని బదులిచ్చారు. మీ విద్యాశాఖ మంత్రే చెప్పారు కదా? అని విలేకరులు మళ్లీ ప్రశ్నించగా.. 'నేను విద్యాశాఖ మంత్రిని కాదు. సీఎంవోకు వెళ్లి అడిగితే అరెస్టు విషయం చెప్పారు' అని మంత్రి సమాధానమిచ్చారు.

ఇవీ చూడండి :

Last Updated : May 11, 2022, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details