సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి... తన అక్రమ మైనింగ్ దోపిడీ కోసం సొంత పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని బలి చేయటానికి సిద్దమయ్యారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టించే స్థాయిని దాటి.. సొంత పార్టీ ఎంపీపైనే తప్పుడు కేసులు పెట్టె స్థాయికి వైకాపా నేతలు దిగజారారని మండిపడ్డారు. సర్వేపల్లి రిజర్వాయర్ పరిధిలో అక్రమ మైనింగ్ అనుమతుల కోసం.. ఎంపీ మాగుంట సంతకాన్ని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులే ఫోర్జరీ చేసి దరఖాస్తు చేశారని ఆరోపించారు.
ఎంపీ సంతకంతో వచ్చిన మూడు దరఖాస్తులపై నిజానిజాలు తెలుసుకోకుండా అధికారులు అనుమతులు ఇచ్చేశారన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమ మైనింగ్ పై పెద్దఎత్తున ఆందోళనలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మాగుంటను అన్యాయంగా కేసులో ఏ2గా ఇరికించారని తెలిపారు. సర్వేపల్లి రిజర్వాయర్ లో వెయ్యి క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమంగా తవ్వుకునే స్థాయికి మాగుంట దిగజారుతారా అని ప్రశ్నించారు. వైకాపాలో మాగుంట పరిస్థితిని చూస్తే జాలేస్తోందని ఎద్దేవా చేసారు. ఎమ్మెల్యే కాకాని అక్రమ మైనింగ్ పై.. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులో బాధ్యులైన పోలీస్, జలవనరుల శాఖ ఇంజినీర్ కృష్ణమోహన్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. సర్వేపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారంలో కాకాని పాత్రే అంతిమమని పేర్కొన్నారు.
అమరరాజా సంస్థని పొమ్మనడం సిగ్గు మాలిన చర్య: నాగూల్ మీరా