TDP SOMIREDDY: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. విభజన చట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలని సూచించారు. కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరం లేని చట్టసవరణ.. తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా అని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Assembly constituencies: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించనంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆర్టికల్ 170కి లోబడి ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ సీట్లను 225కు, తెలంగాణలోని సీట్లను 153కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్ 26(1) చెబుతోందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.