tdp leader somireddy speaks on sand reaches: ఇసుకరీచ్లు నిర్వహిస్తున్న జేపీ సంస్థ ఏం చేసుకుంటే తమకేంటి అన్నట్లుగా సీనియర్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మాట్లాడుతున్నారని.. తెదేపా పొలిట్ బ్యూరోసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. "ప్రజలు ఎక్కడ, ఎలాపోతే మాకేంటి? ఊళ్లు కొట్టుకుపోతే ప్రభుత్వానికి ఏం సంబంధం? అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి" అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగుతున్న ఇసుకతవ్వకాలపై తీవ్ర నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ ద్వివేదీ, వెంకటరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
రాష్ట్రంలోని ఇసుకరీచ్ లలో జరుగుతున్న దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత.. వారికి లేదా అని ప్రశ్నించారు? రాష్ట్రం నుంచి రోజుకి 2వేల లారీల ఇసుక పొరుగు రాష్ట్రాలకు అనధికారికంగా తరలిపోతోందని ఆరోపించారు. ఇసుక తవ్వకాలు, రవాణా రూపంలో సంవత్సరానికి రూ.7వేల కోట్ల వరకు దోపిడీ జరుగుతోందన్నారు. జేపీ సంస్థ ఎలా వ్యవహరించినా, ఎంత దోచుకున్నా తమకు సంబంధం లేదని.. పంచాయతీ రాజ్, మైనింగ్ శాఖాధికారులు చెప్పడం సమంజసం కాదన్నారు. నదీప్రవాహాంలో, నదిగట్లపై ఇష్టానుసారం రోడ్లువేయడం, తవ్వకాలు జరపడం నిషేధమని తెలియదా? అని నిలదీశారు.