తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మనస్పర్థలు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కృష్ణా జలాలపై ఉన్న హక్కుల్ని కాలరాస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఇద్దరూ.. ఆరు జిల్లాల హక్కులకు భంగం కలిగేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ విభేదాలా, ఆర్ధిక లావాదేవీల సమస్యలా లేక షర్మిల వల్ల ఏర్పడిన దూరమా అని ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కలహాలకు ఆరు జిల్లాల ప్రజలు బలవుతున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
శ్రీశైలం జలాశయం నిండినా పోతిరెడ్డిపాడుకు నీరు వదలొద్దని తెలంగాణ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీకృష్ణ.. కేఆర్బీఎమ్కు లేఖ రాయటాన్ని.. సోమిరెడ్డి తప్పుబట్టారు. నీరు సముద్రానికి పోయినా పర్లేదు కానీ సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అందకూడదన్నట్లు.. తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీవ్రంగా పరిగణించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.