రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలను తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం శుభపరిణామమని ఆయన అన్నారు. వర్గీకరణకు దేశంలో మొదటిసారిగా ప్రతిపాదించింది అప్పట్లో తెదేపా ప్రభుత్వమేనన్నారు. రిజర్వేషన్ల ఫలాలు సమాజంలో అట్టడుగు వర్గాల వారికి అందడం లేదనే.. అప్పట్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు విధానపరమైన నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. అది ఎంత సమంజసమైనదో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సందేశంతో అర్ధమవుతోందని తెలిపారు.
పార్లమెంటులో చట్టం చేయాలనే నిబంధనతో అసెంబ్లీలో చేసిన తీర్మానం అమలుకాలేదన్న సోమిరెడ్డి... వర్గీకరణ హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని ఇప్పుడు కోర్టు చెబుతోందని అన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియను సమూలంగా సమీక్షించి అట్టడుగు వర్గాల వారికి, ఇంత కాలం రిజర్వేషన్లకు నోచుకోని వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానాన్ని కూడా కోర్టు ప్రస్తావించిందని తెలిపారు. క్రీమీలేయర్ ప్రస్తుతం సమాజానికి ఎంతో అవసరమైన అంశమని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకే కుటుంబంలో 3 తరాలుగా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వారిని చూస్తున్నామన్న ఆయన.. అదే సమయంలో 3 తరాలుగా ఎలాంటి రిజర్వేషన్ ఫలాలు అనుభవించకుండా అణగారిన వర్గాలుగా మిగిలిని వారూ ఉన్నారన్నారు. ఈ అసమానతలను తొలగించడానికి క్రీమీలేయర్ విధానాన్ని పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని సోమిరెడ్డి స్పష్టంచేశారు.