డిమాండ్ల సాధన కోసం ధర్మపోరాటానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (govt employees) తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (payyavula keshavulu) ప్రకటించారు. జగన్ (cm jagan) అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఉద్యోగులకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అడుగడుగునా వారిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. జీతాల కోసం ఉద్యోగులు రోడెక్కే దుస్థితి కల్పించారని ధ్వజమెత్తారు. పీఆర్సీ (PRC) అమలు, సీపీఎస్ (CPS) రద్దు, డీఏ (DA) బకాయిల విడుదలపై కనీస ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని చిన్నచూపు చూసేలా ఎప్పుడోకప్పుడు జీతాలు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారని తెలిపారు.
6 లక్షల మంది ఉద్యోగుల్ని అవమానించేలా పీఆర్సీపై స్పష్టత కోసం ఉద్యోగ సంఘ నాయకుల్ని రోజంతా సచివాలయంలో (Secretariat) నిలబెట్టారని మండిపడ్డారు. విధులు నిర్వర్తిస్తూ కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవటం దారుణమన్నారు. ఉద్యోగ సంఘ నాయకులకు ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) సొమ్మును కూడా దారి మళ్లించటం సిగ్గుచేటన్నారు. కొండలా పేరుకుపోయిన పీఆర్సీ నివేదిక బయటపెట్టకుండా ఉద్యోగుల్ని ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. 50 శాతం ఫిట్మెంట్తో (Fitment) పీఆర్సీ అమలు చేయాలనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పయ్యావుల డిమాండ్ చేశారు.