Payyavula fires on YSRCP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటే.. సీఎం డ్యాష్‌బోర్డులో వివరాలెందుకు అప్‌డేట్ చేయట్లేదని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. శాసనసభ ఆమోదం లేకుండా పైసా కూడా ఖర్చు చేసే అధికారం సీఎంకు లేదని స్పష్టం చేశారు. శాసనసభ ఆమోదించినట్లు ఖర్చు పెడుతున్నారా? లేదా? అనేది ప్రజా పద్దుల కమిటీ చూస్తుందన్న పయ్యావుల.. అసెంబ్లీ ఆమోదం లేకుండానే రూ.98వేల కోట్లు ఖర్చుపెట్టడం పెద్దనేరమని మండిపడ్డారు.
మూలధన వ్యయం చేయని రాష్ట్ర ప్రభుత్వం.. రుణ అర్హత కోసం లెక్కల్లో చూపిస్తోందని పయ్యావుల విమర్శించారు. వ్యవసాయం, జలవనరులు, రహదారుల ప్రాజెక్టులపై పెట్టుబడి పెడితే.. భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందన్నారు. జలవనరుల శాఖలో తెదేపా హయాంలో 68వేల కోట్లు ఖర్చుచేస్తే.. ఈ ప్రభుత్వ హయాంలో పోలవరం మినహాయిస్తే 6వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ధ్వజమెత్తారు. విద్యుత్తు శాఖలో పంపిణీ సంస్థల బకాయిలే 12వేల కోట్లున్నాయని ఆక్షేపించారు. రోడ్లేయడమే నేరం అన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.