Payyavula on CAG Report: కాగ్ అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయలేదని తెదేపా నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆర్థికశాఖ కార్యదర్శి పేరుతో లేని అధికారాన్ని వాడుకున్నారని విమర్శించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లలో వైకాపా పాలనలో మద్యం ఆదాయం రెట్టింపైందని.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటి అప్పులు చేశారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
‘‘రూ.48వేల కోట్లకు సంబంధించి రికార్డు సరిగా లేదని కాగ్ చెప్పింది. కాగ్ చెప్పి రెండేళ్లు దాటినా ఆడిటింగ్ నిర్ధారించలేదు. రికార్డు సరిగా లేకుంటే బ్యాంకులు ఊరుకోవని ఆర్థిక మంత్రి బుగ్గన చెబుతున్నారు. కానీ, రూ.వేల కోట్లు ఎటు వెళ్లాయో తెలియడం లేదు. రాష్ట్ర పరిస్థితులపై క్వాలిఫైడ్ ఒపినీయన్‌ను కాగ్ ఇచ్చింది. ఎక్సైజ్ , రిజిస్ట్రేషన్ల ద్వారా పన్ను బాగా పెంచారు. మూడేళ్లలో వైకాపా పాలనలో మద్యం ఆదాయం రెట్టింపైంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటి అప్పులు చేశారు.