ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్‌ తన అవినీతి బురదను లోకేశ్‌కు అంటించాలని చూస్తున్నారు'

జగన్‌ తన అవినీతి బురదను లోకేశ్‌కు అంటించాలని ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ టెండర్‌ ప్రక్రియ పూర్తైన 2015 నాటికి లోకేశ్‌ మంత్రిగా లేరని గుర్తు చేశారు. ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.770 కోట్లయితే...రెండు వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందో సమాధానం చెప్పాలన్నారు.

By

Published : Sep 22, 2020, 11:06 PM IST

'జగన్‌ తన అవినీతి బురదను లోకేశ్‌కు అంటించాలని చూస్తున్నారు'
'జగన్‌ తన అవినీతి బురదను లోకేశ్‌కు అంటించాలని చూస్తున్నారు'

ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏ విచారణకు ఆదేశించినా...అవినీతిని నిరూపించలేరని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ స్పష్టం చేశారు. జగన్‌ తన అవినీతి బురదను లోకేశ్‌కు అంటించాలనే ఉద్ద్యేశ్యంతోనే రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్ముతో పెట్టిన పత్రికలో ఫైబర్‌ నెట్‌ కుంభకోణం పేరుతో తప్పుడు కథనాలు రాయించారని మండిపడ్డారు. ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.770 కోట్లు అయితే.. రెండు వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారత్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్క్‌ ప్రాజెక్ట్​లో భాగస్వామ్యం కోసం ఏపీ ప్రభుత్వంలోని అధికారులు దిల్లీ వెళ్లేందుకు..ఎంవోయూపై సంతకం చేయడానికి అనుమతి కోరుతూ వచ్చిన ఫైల్​పై మాత్రమే లోకేశ్‌ సంతకం చేశారని వెల్లడించారు.

రాష్ట్ర ఫైబర్‌ నెట్‌కు, భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌కు చాలా తేడా ఉందన్నది వైకాపా ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వం తక్కువ ఖర్చుతో అమలుచేసిన ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ను చూశాకే... కేంద్రం బీబీఎన్‌ఎల్‌ ప్రాజెక్ట్‌ టెండర్లను ఖరారు చేసిందని పట్టాభి వివరించారు. ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ టెండర్‌ ప్రక్రియ పూర్తైన 2015 నాటికి అసలు లోకేశ్‌ మంత్రిగా లేరని గుర్తు చేశారు. బీబీఎన్‌ఎల్‌ వెబ్‌ సైట్​లోకి వెళ్లి ప్రాజెక్ట్స్‌ అనే ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే..ఏపీలో వివిధ గ్రామాలకు బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు అందించే వివరాలన్నీ కనిపిస్తాయన్నారు. ఆనాడు టెండర్లు ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి పర్యవేక్షణలో జరిగాయో కూడా స్పష్టంగా తెలుస్తుందని పట్టాభి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details