TDP LEADER PATTABHI COMMENTS ON CM JAGAN: ఏపీ మారీటైమ్ బోర్డులో రూ.1200కోట్ల నిధుల్ని జగన్ ప్రభుత్వం కొల్లగొట్టిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. భవిష్యత్తులో పోర్టుల అభివృద్ధికి, కొత్త పోర్టుల నిర్మాణానికి వినియోగించాల్సిన ఈ నిధుల్ని దోచుకుతిన్నారని ధ్వజమెత్తారు. మారీటైమ్ బోర్డు ఆదాయాన్ని పోర్టుల అభివృద్ధికే వినియోగించాలని చట్టం స్పష్టం చేస్తుంటే... నిబంధనలకు విరుద్ధంగా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.
AP MARITIME BOARD: ప్రతీ ఏటా రూ.250కోట్లు వివిధ పోర్టుల నుంచి ఏపీ మారీటైమ్ బోర్డుకు ఆదాయంగా వస్తోందని వివరించారు. గత రెండేళ్ల నుంచి వచ్చిన దాదాపు రూ.600కోట్ల ఆదాయంతో పాటు గంగవరం పోర్టుని విక్రయించగా వచ్చిన మరో రూ.600కోట్లు కలిపి మొత్తం రూ.1200కోట్లు కాజేసి దివాళా తీయించే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం సొమ్ముల్ని ఇదే విధంగా దోచుకున్నారని ఆక్షేపించారు. గంగవరం పోర్టు తెగనమ్మిన అంశంపై తెలుగుదేశం బయటపెట్టిన ఆధారాలకు వైకాపా పెద్దలు సమాధానాలు చెప్పలేక మంత్రులు ముఖం చాటేసుకుంటున్నారన్న పట్టాభి..., దీనిని నేరంగీకారంగా భావించవచ్చా అని నిలదీశారు. వివిధ పోర్టుల్లో అభివృద్ధి పనులకు పనులు చేపట్టాలంటే నామమాత్రపు అడ్వాన్సులు చెల్లించేందుకూ అవకాశం లేకుండా మారీటైమ్ బోర్డును దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే వివిధ పోర్టుల అభివృద్ధికి టెండర్లు కూడా రావట్లేదని విమర్శించారు. మారీటైమ్ బోర్డు ఆడిట్ రిపోర్టును శాసనసభలో ఉంచాలన్న నిబంధనను కూడా ఉల్లంఘించి ఇంతవరకూ చట్ట సభల ముందుకు తీసుకురాకపోవటానికి కారణం అవినీతేనని దుయ్యబట్టారు. మారీటైమ్ బోర్డు ఆడిట్ రిపోర్ట్ ను తక్షణమే సభలో ప్రవేశపెట్టాలని పట్టాభి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Car Crashed Into Pond: వంకలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి