ప్రభుత్వం చేపట్టిన భూ రక్ష కార్యక్రమంపై తెదేపా నేత పట్టాభి విమర్శలు గుప్పించారు. దాదాపు కోటి 39లక్షల ఆస్తులకు భూధార్ కార్డులను తెదేపా ప్రభుత్వం అందజేసిందన్నారు. సాంకేతికత సాయంతో రిజిస్ట్రేషన్లు జరిగేలా చేయటంతో పాటు ప్రతి రిజిస్ట్రార్ కార్యాలయంలో రెటీనా స్కాన్, వేలిముద్ర ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగే వ్యవస్థను చంద్రబాబు అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. ఇవన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి, సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లంటూ భూ భక్షణకు తెరలేపారని విమర్శించారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు సృష్టించటం ద్వారా వాటి పరిష్కారం పేరుతో ప్రభుత్వం, వైకాపా నేతలు భూములు కొట్టేసేందుకే ఈ కుట్ర పన్నారని పట్టాభి ఆరోపించారు. ప్రజలంతా వారనికోసారి భూములు తమ పేరుమీద ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎవరి భూమినైనా కబ్జా చేసేందుకు వైకాపా నేతలు యత్నిస్తే స్థానిక తెదేపా నేతల్ని సంప్రదిస్తే వారి తరఫున పోరాడతామని తెలిపారు.