రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. అప్పుడే ఎవరి ప్రమేయముందో విచారణలో తెలుస్తుందన్నారు. గత జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లీజులు పొందిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు సుధాకర ఇన్ ఫ్రాటెక్ కంపెనీపై భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే... ముఖ్యమంత్రి మాత్రం అదే కంపెనీకి గోదావరిలో ఇసుక తవ్వకాలకు అనుమతిలిచ్చారన్నారు. సీఎం కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఇసుకదోపిడీ యథేచ్ఛగా జరుగుతోందనడానికి ఇంతకంటే రుజువేం కావాలన్నారు.
సుధాకర్ ఇన్ ఫ్రాటెక్ నేరుగా, తమకు పలానా ప్రాంతంలో ఇసుకతవ్వకాలకు అనుమతికావాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయాలనికి రాసిన లేఖ సహా, ఇతర ఆధారాలను పట్టాభి... మీడియా సమావేశంలో బయట పెట్టారు. సుధాకర్ ఇన్ ఫ్రాటెక్ కంపెనీతో సంబంధమున్న మంత్రి వెల్లంపల్లి సోదరుడు రఘునరసింహారావు పేరుని జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు స్పష్టంగా తమ ఫిర్యాదులో పేర్కొన్నా... ప్రభుత్వం మంత్రి సోదరుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఇసుక దోపిడీలో మంత్రి సోదరుడి హస్తమున్నట్లు స్పష్టంగా తేలినా కూడా మంత్రి వెల్లంపల్లిని ఎందుకు కేబినెట్ నుంచి తొలగించలేదని దుయ్యబట్టారు. ఒక ప్రైవేట్ కంపెనీ తమకు పలానా ప్రాంతంలో ఇసుకతవ్వకాలకు అనుమతివ్వాలని నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.