తాను జైలుకెళ్లడానికైనా సిద్దంగా ఉన్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. తానేం దేశాన్ని దోచుకుని జైలుకెళ్లడం లేదని చెప్పారు. పట్టాభి ఏదో అన్నాడని ఫీలవుతోన్న సీఎం.. తన వద్దనున్న మంత్రి ఏపీలోని తల్లులందర్నీ తప్పుడు మాటలు అనలేదా అని ప్రశ్నించారు. మైదుకూరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు.. హత్యకు ప్రేరేపించడం కాదా అని నిలదీశారు. తెదేపా పార్టీ కార్యాలయంపై దాడి విషయంలో సీఎం జగన్ డిఫెండ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. సీఎం జగన్ తీరుపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారని.. దానికి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు.
తెదేపా గుర్తింపు రద్దు చేయమని వైకాపా ఫిర్యాదు చేసుకున్నా నష్టం లేదన్నారు. కేజీ గంజాయికి ఇంత అని ముడుతుండడం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే అనుమానం వస్తోందని ఆరోపించారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం బాగా భుజాలు తడుముకుంటోందని మండిపడ్డారు. తాము ఫెయిలయ్యామన్న విషయం తెలుసుకునే.. పీకే రంగంలోకి దిగుతున్నాడని కెబినెట్లో జగన్ పీకే విషయాన్ని ప్రస్తావించారని విమర్శించారు.
దిల్లీకి వెళ్లి డ్రగ్స్, గంజాయి గురించి ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ కార్యాలయంపై దాడి విషయాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. వైకాపా ఇంకా ఇదే విధంగా రెచ్చగొట్టినా.. దాడులు చేసినా చూస్తూ ఊరుకోమని.. తలలు పగులుతాయని ఘాటుగా హెచ్చరించారు. ప్రజల కోసం పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.