రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో జగన్మోహన్ రెడ్డి(CM JGAN) బాదుడు రెడ్డి అనే పేరును సార్ధకం చేసుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(NARA LOKESH) ఎద్దేవా చేశారు. రక్తం పీల్చే జలగ కన్నా దారుణంగా సీఎం ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆకాశమే హద్దుగా ఏపీలో ఇంధన ధరలు దూసుకెళ్తున్నాయని అన్నారు. ఇండియన్ పెట్రోల్ లీగ్లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేర్చారంటూ లోకేశ్ ట్విట్టర్లో ఆక్షేపించారు.
వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు అభివృద్ధి సుంకం అంటూ.. అన్నీ కలిపి ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం లీటరుకు రూ.30 చొప్పున భారం(TAXES) మోపుతోందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని నీతి కబుర్లు చెప్పి, ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అంటూ బోర్డులు పెట్టారంటే రాష్ట్రంలో దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర పన్నులను తగ్గించుకోవాలని డిమాండ్ చేశారు.