ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన విశాఖ జిల్లా రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై కేసులు బనాయించి జైలుకి పంపడం దారుణమని మండిపడ్డారు.
చర్చల పేరుతో గిరిజన ప్రజాప్రతినిధులను ఆహ్వానించి.. పోలీసులచేత వారిని నిర్బంధించి, నేరం చేసిన వాళ్లలా నేలపై కూర్చొబెట్టి అవమానించడం సీఎం జగన్ అధికార దర్పానికి పరాకాష్టని లోకేశ్ ధ్వజమెత్తారు. గిరిజనుల అభ్యున్నతికి పాటుపడాల్సిన అధికారే.. గిరిపుత్రులపాలిట అరాచకంగా ప్రవర్తించడం క్షమించరాని నేరమన్నారు. గిరిజనుల హక్కులు కాపాడి, రక్షణగా ఉన్న చట్టాలు, జీవోలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేటరైట్ పేరుతో సాగిస్తున్న బాక్సైట్ అక్రమమైనింగ్ దందాని జగన్ అండ్ కో తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు.