వైకాపా అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అందరికీ ఇచ్చే అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలు కాకుండా ఎస్సీలకు ప్రత్యేకంగా ఏం చేశారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా అని నక్కా ఆనంద బాబు సవాల్ చేశారు. వైకాపా నుంచి గెలుపొందిన ఎస్సీ నేతలు దీనిపై చర్చకు రాలేకుంటే కనీసం చేసిందైనా చెప్పాలని డిమాండ్ చేశారు.
'దేశద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టడం, శిరోముండనాలు, అవమానాలు, ఛీత్కారాలు, భూములు బలవంతంగా లాక్కోవటం తప్ప ఈ రెండేళ్లలో ఎస్సీలకు వైకాపా ప్రభుత్వం అదనంగా ఏం చేసింది? కేంద్రం ఇచ్చే ఉపకార వేతనాలను కూడా తినేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన ఎస్సీలందరి పట్ల ఇష్టమొచ్చినట్లు చేస్తాం పడండి అన్నట్లు నిలువునా వంచించారు. ఎస్సీలతో పాటు ముస్లిం, మైనార్టీలకు ప్రభుత్వం అదనంగా ఏమీ చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యేక పథకాలన్నీ రద్దు చేశారు. నియంతృత్వ ధోరణితో ఎల్లకాలం కొనసాగుతామనుకోవటం భ్రమే. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. ఎస్సీలంతా తిరగబడేరోజు దగ్గరలోనే ఉంది' - నక్కా ఆనందబాబు