రాష్ట్రంలో రహదారులపై చిన జీయర్ స్వామి ఆవేదనతో స్పందించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. గతుకులు-గుంతలు, ఒడిదుడుకుల గురించి జీయర్ స్వామి ప్రస్తావించిన వీడియోను లోకేశ్ విడుదల చేశారు. చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలతో జగన్‌రెడ్డి పాలనలో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతోందని లోకేష్ ట్విటర్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనం గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. పక్కరాష్ట్ర పాలకులు అధ్వాన పాలనకి ఉదాహరణగా మన రాష్ట్రాన్ని చూపిస్తున్నారని, అయినా ప్రభుత్వ స్పందన శూన్యమని లోకేశ్ ధ్వజమెత్తారు.
చినజీయర్ ఏమన్నారంటే..? :భక్తులను ఉద్దేశించి ప్రసంగం చేస్తున్న సమయంలో.. ప్రయాణం గురించి వివరించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై చినజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండొచ్చని, ఒక్కోసారి గొతులు ఎక్కువగా ఉండొచ్చని అన్నారు. తాము జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వరకు ప్రయాణించామని, ఆ అనుభవం చాలా బాగుందని వ్యంగ్య బాణాలు సంధించారు. చక్కగా జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు.