ముఖ్యమంత్రి జగన్ నియంత కంటే ఘోరంగా కక్ష తీర్చుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. "దేశంలో ప్రజల ప్రాణాలు పట్టించుకోని ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి"అని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయటం తగదని హితవు పలికారు.
జగన్ రెడ్డి సర్కారుపై విశ్వాసం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్న 5 కోట్ల మందినీ అరెస్ట్ చేస్తారా? అని లోకేశ్ నిలదీశారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందని లోకేశ్ గుర్తు చేశారు. వై కేటగిరి భద్రతలో ఉండటంతో పాటు ఇటీవలే బైపాస్ సర్జరీ చేసుకున్న సొంత పార్టీ ఎంపీని పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించడం జగన్ సైకో మనస్థత్వానికి నిదర్శనమన్నారు. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ కాస్తా.. సీఎం ఇండివిడ్యువల్ డిపార్ట్మెంట్గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే సీఐడీ అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైకాపాలో చేరకుంటే జేసీబీలతో ధ్వంసం, లొంగకపోతే పీసీబీ తనిఖీలని జగన్ ప్రభుత్వంపై లోకేశ్ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు.