ప్రాజెక్టుల అంశంపై తెలుగు రాష్ట్రాల ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జగన్, కేసీఆర్‌లు కలిసి కేంద్రంతో పోరాడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కృష్ణా జలాల వివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులు తమ నాటకాలను కట్టిపెట్టాలని హితవు పలికారు. రాత్రులు స్నేహంగా ఉంటూ ఉదయం గొడవ నటిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. కేఆర్బీఎం, జీఆర్బీం సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీ హక్కుల కోసం ఎందుకు పోరాడట్లేదో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కేంద్ర గెజిట్‌పై ఏపీ ఒక్క అభ్యంతరం కూడా లేవనెత్తకపోగా.. స్వాగతించటం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత అజెండా కోసం ఒకరినొకరు సహకరించుకుంటున్న కేసీఆర్, జగన్ రెడ్డిలు, రైతుల సమస్య పరిష్కారానికి మాత్రం దూరం నటిస్తున్నారని విమర్శించారు. నీటి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా తెలుగు వారిని చులకన చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.