సుప్రీంకోర్టు ఆదేశాలతో విధిలేని పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూనుకుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇస్తున్న ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటుహక్కుని దుర్వినియోగం చేసేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రజలను మభ్యపెట్టడానికే ఏకగ్రీవాల పేరుతో ప్రకటనలు'
ప్రజలను మభ్యపెట్టడానికే ప్రభుత్వం ఏకగ్రీవాల పేరుతో ప్రకటనలు ఇస్తోందని తెదేపా సీనియర్ నాయకులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. వైకాపా నాయకుల ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎన్నికలకు సహకరించాల్సిన సర్కారు.. అభూతకల్పనలతో ప్రజలను మభ్యపెట్టడానికే ఏకగ్రీవాల పేరుతో ప్రకటనలిచ్చిందన్నారు. ప్రభుత్వమిచ్చిన ప్రకటనల్లోని సచివాలయం నమూనా ఏరాష్ట్రందో సజ్జల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాంకేతిక కారణాలు సాకుగా చూపి, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మద్దతుదారులు ఎన్నికల్లో పోటీచేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ దుర్మార్గాలు, దుర్నీతిని అడ్డుకొని వైకాపాకు ఓటు అనే ఆయుధంతో బుద్ధిచెప్పడానికి ప్రజలంతా ఇప్పటికే సన్నద్ధులై ఉన్నారని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఒకేసారి ఎన్నికలు, వ్యాక్సినేషన్ సమస్యే: డీజీపీ గౌతమ్ సవాంగ్