తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు 90శాతం రాయితీపై ఇచ్చిన తుంపరసేద్యం పరికరాలను వైకాపా ప్రభుత్వం ఎందుకివ్వట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు నిలదీశారు. గత రెండేళ్ల కాలంవో కేంద్రం నుంచి రూ.3వేల కోట్ల సాయాన్ని నిరాకరించిన ఏకైక ప్రభుత్వం వైకాపా అని దుయ్యబట్టారు.
"రాయలసీమ రైతుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకే కంటితుడుపు చర్యగా రూ.1190కోట్లతో డ్రిప్ రాయితీ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల వాటాగా 10శాతం మాత్రమే డబ్బులు వసూలు చేయాల్సిన ఈ పథకంలో దాదారు 25శాతం వరకు రైతుల ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. తెదేపా అందించిన సంక్షేమంలోనూ కోత పెట్టి రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి రైతుల గురించి మానేసి కులాలు, రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడతారు. రెండేళ్లలో జగన్ రెడ్డి వ్యవసాయన్ని సంక్షోభంలోకి నెట్టి.. రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టారు. ప్రభుత్వ సాయానికి నోచుకోవట్లేదనే బాధ, ఆవేదనతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. ఈ క్రాప్ నమోదు సక్రమంగా జరగకపోవడంతో పంటల బీమా పరిహారానికి రైతులు నోచుకోలేకపోయారు" అని కాలువ మండిపడ్డారు.