రాష్ట్రంలో కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కాక.. రైతుల బతుకు ప్రశ్నార్థకమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు(kala venkat rao) ధ్వజమెత్తారు. రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(cm jagan) కష్టాల కడలిలోకి నెట్టడంతో.. గిట్టుబాటు ధర లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో.. పచ్చి మిర్చి, సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో.. టమోటాను రోడ్డుపక్కనే పారబోసే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం రూ.1000 - 1500 వరకూ ఉన్న 50కిలోల ఉల్లి బస్తా ధర రూ.100 - 300కు పడిపోయిందన్నారు. వైకాపా నేతలకు అద్దెల రూపంలో నిధులు దోచిపెట్టేందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారే తప్ప.. వాటిల్లో పంట వివరాల నమోదు, కొనుగోళ్లు సక్రమంగా జరగట్లేదని మండిపడ్డారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక.. రైతుల పెట్టుబడి భారం 30శాతం పెరగటంతో పాటు, దళారుల బెడద, మార్కెట్లో దోపిడీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పాదయాత్రలో హామీ ఇచ్చిన రూ.4వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయ పనిముట్లకు.. సబ్సిడీ 28 నెలలుగా పక్కనపెట్టేశారని మండిపడ్డారు. తుంపరసేద్యం పనిముట్లకు.. తెదేపా ప్రభుత్వం 90శాతం సబ్సిడీ ఇచ్చి.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎస్సీ, ఎస్టీ రైతుల్ని ఆదుకుంటే, జగన్ రెడ్డి ఆ పథకాన్ని ఎత్తివేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులు నిండుగా ఉన్నా.. వ్యవసాయానికి నీరివ్వకుండా సముద్రంలోకి వదలటంతో సాగుశాతం పడిపోయిందని ఆరోపణలు చేశారు. రైతుల్ని అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తూ.. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని దుయ్యబట్టారు.