కరోనా కట్టడిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర తెదేపా అధ్యక్షులు కళా వెంకట్రావ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కేసులు 5 లక్షలు దాటాయన్నారు. అత్యధిక కేసుల నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని... కేసుల రికవరీలో మాత్రం అట్టడుగునుందని కళా ధ్వజమెత్తారు. క్వారంటైన్ కేంద్రాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని దుయ్యబట్టారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారికి 2వేల రూపాయలు అందడం లేదన్నారు.
కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.... ఆరోగ్యశ్రీ అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు సరైన వైద్యం అందడం లేదని మండిపడ్డారు. ప్రజలు ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మూడు రాజధానులను పక్కనపెట్టి కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.