వైకాపాకు ఎందుకు ఓటెయ్యాలని.. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలదా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు ప్రశ్నిచారు. 4, 5 విడతల రైతు రుణమాఫీ ఎగ్గొట్టి.. 32 లక్షల మంది రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. రైతులకు రూ.2 వేల కోట్ల బకాయిలు పెట్టినందుకు వైకాపాకు ఓటేయాలా అని నిలదీశారు. రైతుల బోర్లకు మీటర్లు పెట్టే వైకాపాను ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. పన్నులు, ధరలు, అప్పులు పెంచడం ద్వారా ప్రతి కుటుంబంపై రూ.2 లక్షల భారం మోపారని ఆక్షేపించారు.
ఏటా జనవరిలో ఇస్తానన్న ఉద్యోగాల క్యాలెండర్ ఎటు వెళ్లిందని కళా వెంకట్రావు మండిపడ్డారు. తెదేపా తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి.. 30 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులను రోడ్డున పడేశారని ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసి రూ.4 వేల కోట్లు వృధా చేశారని విమర్శించారు. సెంటు పట్టా పేరుతో.. రూ.6500 కోట్ల అవినీతికి పాల్పడినందుకు వైకాపాకు ఓటు వెయ్యాలా అని ప్రశ్నించారు. 34 శాతం రిజర్వేషన్ను 24 శాతానికి తగ్గించి 16 వేల బీసీల పదవులకు గండి కొట్టారని మండిపడ్డారు.