అంబులెన్సుల విషయంలో వైకాపా ప్రభుత్వం చేసింది గోరంత.. ప్రచారం కొండంతంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు విమర్శించారు. అబద్ధాలు పదేపదే చెప్పి నిజం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. ఒక 108 అంబులెన్స్ నిర్వహణకు తెదేపా ప్రభుత్వం నెలకు లక్షా 30 వేలు చెల్లించగా.. దాన్నిప్పుడు రూ.2 లక్షల 21 వేలకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఒక్కోదానిపై నెలకు అదనంగా రూ.90 వేలు చెల్లిస్తూ ఐదేళ్లలో విజయసాయిరెడ్డి అల్లుడి సంస్థకు రూ.307 కోట్లు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
కరోనా కిట్లలో జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిందని కళా వెంకట్రావు ఆరోపించారు. స్కాముల కోసమే స్కీములు పెడుతోందంటూ దుయ్యబట్టారు. అబద్ధాలతో ఆడంబర ప్రచారం చేసుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.