అత్యున్నత ప్రోటోకాల్ ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ తొలిసారి సొంత రాష్ట్రానికి వస్తే ప్రభుత్వం ఆహ్వానం పలికిన విధానం దారుణమని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయ కుట్రలు ఎన్నైనా ఉండొచ్చు కానీ.. ఇలా వ్యవహరించటం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.
గవర్నర్, ముఖ్యమంత్రి హాజరుకావాల్సిన కార్యక్రమంలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యే లు, తితిదే ఛైర్మన్, కార్యనిర్వహణాధికారితో ఆహ్వానం పలకటం ఎంత వరకు సబబని నిలదీశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు మొద్దు నిద్ర పోతున్నారా అని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంతి జస్టిస్ రమణను కలిసి సాదరంగా గౌరవ మర్యాదలతో ఆహ్వానం పలకటం, యాదాద్రి దర్శనానికి పిలవటం గౌరవ మర్యాదల్లో పరిపక్వతకు నిదర్శనమన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాకంతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.