వైకాపా ప్రభుత్వ విధానాలు ప్రజా స్వామ్యంలో ప్రజల హక్కులు హరించేలా ఉన్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. 144సెక్షన్ తో ప్రజాగ్రహాన్ని ఎంతకాలం ఆపగలరని నిలదీశారు. ప్రకృతి విపత్తుల చట్టం అడ్డుపెట్టుకుని ప్రజాగ్రహాన్ని తొక్కిపెడుతున్నారని విమర్శించారు. రైతులు ధాన్యం బకాయిల కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తుంటే వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
అప్పులతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి.. అయిన వారికే చెల్లింపులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభలు నిర్వహిస్తూ, నిబంధనలు అతిక్రమిస్తున్న ముఖ్యమంత్రిపై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులు త్వరలోనే జైలుకెళ్లనున్నారని తెలిపారు.