నష్టాల్లో ఉన్న సంస్థకు ఇసుక టెండర్లను ఎలా కట్టబెట్టారని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వాన్ని నిలదీశారు. మరో క్విడ్ ప్రోకోకి సీఎం జగన్ తెరలేపారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకం, స్టాక్ యార్డ్ నిర్వహణను జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే సంస్థకు.. జగన్ కట్టబెట్టారని మండిపడ్డారు. సుమారు రూ.3,500 కోట్లు రెవెన్యూ నష్టాల్లో ఉన్న కంపనీకి.. తవ్వకాలు ఇవ్వడం వెనుక ఏ కుట్ర ఉందని ప్రశ్నించారు.
తమ కేసుల్లో ఉన్న వారికి గుప్తదానం చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ కంపెనీ నష్టాల్లో ఉంది అనడానికి వాటి బాలన్స్ షీట్‌ను చూస్తే అర్ధమవుతుందన్నారు. మొత్తానికి ప్రజలకు ఇసుమంతైన ఇసుక దొరికే పరిస్థితి ఉందా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఆ సంస్థ ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పలు వివరాలను తన ట్విట్టర్ ఖాతాకు జత చేశారు.