కరోనాపై జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే వైకాపా నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రి నేరుగా ప్రజల ముందుకు ఎందుకు రాలేకపోతున్నారని ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లో పాలకులు ప్రజల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పటం ఆనవాయితీ అని.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా ప్రజల్ని కలిసి మాట్లాడుతుంటే మన సీఎం మాత్రం రికార్డెడ్ వీడియో సందేశాలకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు కావాల్సింది వీడియో సందేశాలు కాదని.. బతుకుపట్ల భరోసా అనేది సీఎం గ్రహించాలని ధూళిపాళ్ల హితవు పలికారు.
చిన్న జ్వరమని ఎలా అంటారు?
ప్రపంచవ్యాప్తంగా మేధావులు, శాస్త్రవేత్తలు కరోనాను ఎలా కట్టడి చేయాలని తలకిందులవుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం దాన్ని చిన్న జ్వరం కింద ఎలా చూస్తారని ధూళిపాళ్ల ఆక్షేపించారు. వైకాపా నేతల బాధ్యతరాహిత్యం వల్లే వివిధ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందిందని విమర్శించారు. కరోనా కట్టడికి దేశమంతా జిల్లాను యూనిట్‌గా తీసుకుంటుంటే.. ఏపీలో మండలాన్ని యూనిట్‌గా తీసుకోవటాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ తన ప్రమాదకర నిర్ణయాలతో రాష్ట్రం మొత్తాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. పేదలకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని నిలదీశారు. కరోనా కిట్ల పేరుతో భారీ దోపిడీకి తెరలేపారని.. ఒకపక్క ప్రాణాలు పోతుంటే ఈ సంక్షోభ సమయాన్ని దోపిడీకి వాడుకుంటున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు.
ఇవీ చదవండి...
కరోనా సాధారణ జ్వరం కాదు: పవన్