కృష్ణా జిల్లా గుడివాడలో యథేచ్ఛగా గడ్డం గ్యాంగ్ గ్యాంబ్లింగ్ సాగుతోందంటూ.. మాజీమంత్రి దేవినేని ఉమా ట్విటర్లో ఓ వీడియో పోస్టు చేశారు. గుడివాడలో "క్యాసినో" ఏర్పాటు చేసిన మండపం ఎవరిదని నిలదీశారు. ధాన్యానికి మద్దతుధర లేక, అమ్మినవాటికి డబ్బులురాక రైతులు సంక్రాంతికి దూరమయ్యారన్న దేవినేని.. నయా దందాతో బూతుల మంత్రి కోట్లు కొల్లగొడుతున్నారని అన్నారు. ఆయనపై చర్యలు తీసుకునే ధైర్యం.. సీఎం జగన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు.
మంత్రులు దండుకున్నారు: తెదేపా అధికార ప్రతినిధి వర్మ
మంత్రి కొడాలి నాని.. సంక్రాంతికి క్యాసినో జూదం ద్వారా రూ.250 కోట్లు సంపాదించారని తెదేపా అధికార ప్రతినిధి వర్మ ఆరోపించారు. మంత్రి సొంత కన్వెన్షన్ సెంటర్ లోనే క్యాసినో ఆడినా.. పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు. మంత్రి గోవా సంస్కృతిని తీసుకొచ్చారని విమర్శించారు. సంక్రాంతికి ఉద్యోగులకు జీతాలు, రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని.. మంత్రులు మాత్రం ఆదాయం దండుకున్నారని వర్మ ఆరోపించారు.