కరోనా కట్టడిలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారని తెదేపా సీనియర్ నేత బీద రవిచంద్ర ఆరోపించారు. టీకా పంపిణీలో వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కేంద్రానికి లేఖలు, గ్లోబల్ టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కోట్ల రూపాయలు వెచ్చించి పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనుగోలు చేశాయని, ఏపీ బడ్జెట్లో వ్యాక్సిన్ కొనుగోలుకు నామమాత్రపు కేటాయింపులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీకా తయారీ కంపెనీలకు కులాన్ని అంటగట్టడం ముఖ్యమంత్రి జగన్‌కే చెల్లిందని ధ్వజమెత్తారు. వ్యాక్సిన్ వృథాలో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. కేంద్రం నుంచి 65 లక్షల వ్యాక్సిన్ డోసులు రాగా.. మనం ఉపయోగించింది కేవలం 26 లక్షలు మాత్రమేనన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 16 శాతం లోపే ఉందని, ఇదే తీరు కొనసాగితే టీకా పంపిణీ కార్యక్రమం 2024 వరకు కొనసాగుతుందని మండిపడ్డారు.