ముఖ్యమంత్రి జగన్.. మద్యపాన నిషేధం అంటూనే మహిళల మెడలో పుస్తెలు కూడా లాగేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. 2019లో రూ. 5వేల కోట్లుగా ఉన్న లిక్కర్ ఆదాయం.. 2021 నాటికి రూ.10వేల కోట్లకు చేరిందన్నారు. ఈ మేరకు లిక్కర్‌పై కాగ్ ఇచ్చిన నివేదికను తన ట్విట్టర్‌కు జతచేశారు.
విషం కంటే ప్రమాదకరమైన బ్రాండ్లు తీసుకొచ్చి జనాల జేబులు కత్తిరిస్తున్నారని ఆరోపించారు. మద్యం పేరుతో రూ. 10వేల కోట్ల దోపిడీ చేస్తూ.. మద్యపాన నిషేధం అంటూ గొప్పలు చెప్పుకోవడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. తెదేపా అసత్య ప్రచారం చేస్తోందని చొక్కాలు చించుకునే వైకాపా బ్యాచ్.. కాగ్ బయటపెట్టిన జగన్ రెడ్డి బాగోతాన్ని గ్రహించాలని అయ్యన్నపాత్రుడు హితవు పలికారు.