రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజా సంపద లూటీ అవుతోందని విమర్శించారు. చట్టధిక్కరణ చర్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, బాధితులకు సరైన న్యాయం జరగడం లేదని ఆరోపించారు. నేరస్తులకు సరైన శిక్షలు పడటం లేదని, బాధితులకు న్యాయం చేయాలని కోరిన వారిపైన, బాధితులను పరామర్శించే వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు, అధికారులు.. రాజకీయ ఒత్తిడులకు లోనై చట్టాలకు, న్యాయానికి విరుద్ధంగా ఏకపక్షంగా వెళ్తే సమస్యల్లో పడతారని హెచ్చరించారు. జగన్ కు అధికారం శాశ్వతం కాదని, ప్రజలను, చట్టాలను నమ్ముకుని గౌరవప్రదంగా జీవించాలని హితవు పలికారు. కేవలం పోస్టింగుల కోసం గుడ్డిగా వైకాపా నేతల డిక్టేషన్ను ఫాలో అయి పోలీసులు తమ గౌరవానికి, వృత్తి ధర్మానికి నష్టం కల్పించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.