వైకాపా నేతలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు(TDP state president Atchannaidu) అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వైకాపా నాయకులు మళ్లీ గెలిస్తే.. తమ పార్టీని మూసేస్తామని స్పష్టం చేశారు. కుప్పం గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదన్న అచ్చెన్న... ప్రభుత్వం, పోలీసులు, డబ్బు పంపిణీ వల్లే వైకాపా విజయం సాధించిందన్నారు. ఈ 7 నెలల కాలంలో తెదేపాకు ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని అన్నారు. సీఎం జగన్(CM Jagan) కనుసన్నల్లోనే స్థానిక ఎన్నికలు జరిగాయని ఆక్షేపించారు.
భయపెట్టి గెలిచారు...
గుంటూరు జిల్లా దాచేపల్లి(Dachepalli) నగరపంచాయతీ ఎన్నికల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టారని, 2,3 స్థానాల ఫలితాలను తారుమారు చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే ఎలా వెళ్తారని ప్రశ్నించారు. విశాఖలోనూ మోసం చేసి గెలిచారని ఆరోపించారు. నామినేషన్లు వేయవద్దని చాలా చోట్ల అభ్యర్థులను భయపెట్టారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సొంత ఇలాకా బేతంచర్లలో తెలుగుదేశం పార్టీకే ఆధిక్యం దక్కిందని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు.
డీజీపీకి అంకితం చేయండి...
అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మున్సిపల్ ఎన్నికల్లో బయటపడిందని అచ్చెన్నాయుడు అన్నారు. వైకాపా లెక్కల ప్రకారమే ఇప్పుడు మాకు 48 శాతం ఓట్లు పడ్డాయని వివరించారు. కుప్పంలో దొంగఓట్లతో గెలిచి సంబరాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. డీజీపీ సహకారంతోనే మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిందని అన్నారు. వైకాపా విజయాన్ని డీజీపీకి అంకితం చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు.