గడిచిన రెండేళ్లలో మహిళలపై దాడులు, హింస, దురాగతాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలపై.. జాతీయ మహిళా కమిషన్కు ఆమె లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరే మహిళలపై అత్యాచారాలు పెరగడానికి ప్రధాన కారణమని విమర్శించారు. సాధారణ హింసతో పాటు పోలీసు హింస కూడా ఎక్కువయ్యిందని ఆరోపించారు.
మహిళల భద్రత కోసం దిశా పోలీస్ స్టేషన్లు, దిశా యాప్, దిశా మొబైల్ వాహనాలు ప్రారంభించామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని.. వాస్తవానికి చేసినదంతా పాలక వైకాపా పార్టీ ‘దిశ’ పేరిట పోలీస్ స్టేషన్లకు రంగులు వేసుకోవడమేనని దుయ్యబట్టారు. మహిళలపై ఇలాంటి దారుణమైన నేరాలు ఇంకా కొనసాగితే, రాష్ట్ర మహిళలు శాశ్వతంగా భయం, అభద్రతలోకి వెళ్లిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై.. సమగ్ర విచారణ జరిపి నేరస్థులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భద్రత విషయంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యుూ) తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.