రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఈమేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్కు ఆమె లేఖ రాశారు. ఈనెల10న కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కారాగ్రహం ఫిషింగ్ హార్బర్ వద్ద యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై బాధితురాలు దిశా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినా ఎలాంటి చర్యలు లేవని.. ఎట్టకేలకు మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నెల్లూరులో జరిగిన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నారు.
గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో మహిళలపై దాడులు గణనీయంగా పెరిగాయని అనిత విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై కఠినంగా వ్యవహరించకపోగా.. మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు ఉన్నందునే ఈ తరహా దాడులు పెరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మహిళల భద్రతకు తగు చర్యలు చేపట్టాలని వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు.