రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అరాచకానికి, గూండాయిజానికి ఇచ్చిన ప్రాధాన్యం రాష్ట్రాభివృద్ధికి ఇవ్వడం లేదని.. తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.
రైల్వే జోన్ ఉసే లేదు
పార్లమెంటులో వైకాపా ఎంపీలు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. సీఎం జగన్.. రాజధాని పేరు ప్రస్తావించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం వైకాపా దుష్ట్ర శక్తులు చేతిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోందని దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదా సంగతేంటి..?
కేంద్రం మెడలు వంచైనా.. ప్రత్యేక హోదా తెస్తామన్న వైకాపా ఎంపీలు.. ఇప్పుడెందుకు తలలు దించుకుంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి హోదా వచ్చింది కాబట్టే.. రాష్ట్రానికి హోదా అవసరం లేదనుకుంటున్నారని విమర్శించారు. హోదా తెచ్చి ప్రతి గ్రామాన్ని మరో హైదరాబాద్ చేస్తానన్న విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. రాష్ట్రాభివృద్దికి బదులు.. వైకాపా అభివృద్దికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు పాలనలో ప్రజలు ఏనాడు రోడ్లెక్కలేదు
చంద్రబాబు పాలనలో ఏనాడు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయలేదని.. హింసాంత్మక ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. చంద్రబాబు సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకొని ముందుకెళ్తే.. జగన్ ప్రభుత్వం సంక్షోభాలు సృష్టించి అమరావతిని, రాష్ట్రాభివృద్దిని నిలిపివేసిందని ధ్వజమెత్తారు. హోదా వద్దు.. యువతకు ఉద్యోగం వద్దు.. వివక్ష పాలనే ముద్దు అన్నట్లుగా జగన్ రెడ్డి తీరు ఉందని మండిపడ్డారు.