సీఎం జగన్ సంక్షేమాన్ని కూడా ఒక వర్గానికే పరిమితం చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. హంద్రీనీవా ద్వారా సాగు, తాగు నీరివ్వాలని తెదేపా నేతలు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవటం ప్రభుత్వ అభద్రతా భావానికి నిదర్శనమని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారు కాదన్నారు.
ప్రజల హక్కులను కాలరాస్తూ నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఏ ఒక్కరికీ సంతోషం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. 24 గంటల్లో హంద్రీనీవా నుంచి కుప్పం నియోజకవర్గానికి నీళ్లివ్వకుంటే ప్రజా ఉద్యమం ఎదుర్కోవాల్సి ఉంటుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.