విధ్వంసం, విచ్ఛిన్నం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రశాంత విశాఖ నగరాన్ని కక్ష సాధింపు చర్యలకు కేరాఫ్ అడ్రస్‌గా చేశారని మండిపడ్డారు. వైకాపా నేతల పంపకాల్లో భాగంగానే ఫ్యుజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్నారని విమర్శించారు. వైకాపా పాలనలో క్రూరత్వమే తప్ప, మానవత్వం లేదని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం, అఘాయిత్యాలు, దురాగతాలు పెచ్చుమీరాయని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే సంకెళ్లు, ఎదురు తిరిగితే జైలు అన్నట్లు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
గడువు ఉన్నా...
విశాఖ నగరంలో వైకాపా దుర్మార్గ పాలన పెచ్చు మీరుతోందని,తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనే కారణంతో ఫ్యూజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. హోటల్ లీజు గడువు 2024 వరకు ఉన్నప్పటికీ పండగ పూట హడావుడిగా ఖాళీ చేయించారని ధ్వజమెత్తారు. నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. పబ్లిక్ హాలిడే, అధికారులంతా సెలవులో ఉన్నా నోటీసులు ఎలా వచ్చాయని ఆయన నిలదీశారు. 2024 వరకు గడువు ఉందని పత్రాలు చూపిస్తున్నా ఖాళీ చేయించడం దారుణమైన చర్యని మండిపడ్డారు.