Achennaiadu on State Govt.: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదలను దోచుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న నిరసనలతోనైనా జగన్ సర్కారు దిగిరావాలని డిమాండ్ చేశారు.
దశాబ్దాల క్రితం కట్టిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ పేరుతో జగన్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. బలవంతం లేదంటూనే పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. న్యాయం కోసం పోరాడుతూ..నిరసన తెలుపుతున్న వారికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న తెలుగుదేశం నేతలపై పోలీసులు పలుచోట్ల అన్యాయంగా విరుచుకుపడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. పేదల కోసమే తెలుగుదేశం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ దుర్మార్గం పరాకాష్టకు చేరిందన్న అచ్చెన్నాయుడు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పీల్చుకు తింటున్నారని ఆక్షేపించారు. పేదలపక్షాన టీడీపీ పోరాడుతుందని తేల్చిచెప్పారు.