Chandrababu Condemned Narayana Arrest: పదో తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారని ఆ పార్టీ ఆధినేత చంద్రబాబు ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో విఫలమై అన్నివర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వైకాపా సర్కార్.. జీర్ణించుకోలేక ఈ తరహా కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. నారాయణ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని నిలదీశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, అధారాలు లేకుండా నేరుగా అరెస్టు చేయడం కక్షపూరిత చర్య కాదా? అని మండిపడ్డారు. నారాయణను జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన రోజునుంచి అక్రమ కేసులతో జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
Lokesh News: చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చేయడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతోపాటు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారని లోకేశ్ దుయ్యబట్టారు. సంబంధంలేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సీఎం జగన్.. విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూశారన్నారు. ఈ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైకాపా నేతల్ని వదిలేసి తెదేపా నేతల్ని అరెస్ట్ చేయించి సీఎం సైకో ఆనందం పొందొచ్చు కానీ.. పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎలాంటి మేలూ జరగదని లోకేశ్ అన్నారు.
Achennaidu on Narayana Arrest: ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. మాజీ మంత్రి నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో విఫలమై.. ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని మండిపడ్డారు. అక్రమ అరెస్టుల పట్ల భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రోజురోజుకూ జగన్ రెడ్డిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ మళ్లింపు రాజకీయాలని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.