మీరు ఎన్టీఆర్‌తో.. మాట్లాడాలనుకుంటున్నారా? NTR VIRTUAL: సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీఆర్.. ఆయనే మన ముందుకొచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? రాజకీయ ప్రచారంలో నూతన ఒరవడి సృష్టించిన 1940 మోడల్ చైతన్య రథాన్ని దగ్గరగా తిలకిస్తే ఎలా ఉంటుంది? భలే బావుంటుంది కదా.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ.. ఆ మహనీయుడి విశేషాలను సాంకేతికత ద్వారా అభిమానులకు చేరువ చేస్తోంది. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన మ్యూజియం ద్వారా ఆసక్తికర విశేషాలను తెలుగుదేశం ఐటీ బృందం... భవిష్యత్తు తరానికి పరిచయం చేస్తోంది.
తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న ఎన్టీఆర్.. రెండున్నర దశాబ్ధాల తర్వాత మళ్లీ ముందుకొచ్చి అశేష తెలుగు ప్రజానికాన్ని పలకరిస్తే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం.. ఐటీడీపీ చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఎన్టీఆర్ తనదైన శైలిలో ఇచ్చే సందేశాన్ని ప్రజలతో వర్చువల్ రియాలిటీలో మాట్లాడే విధంగా ఈ కార్యక్రమం రూపొందించారు.
ఎన్టీఆర్ వాడిన చైతన్య రథాన్ని, అలనాటి కొన్ని అనుభవాల చిత్రమాలికను ఒక మ్యూజియంలా ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ వర్క్ షాప్ స్టాల్‌ను ప్రయోగాత్మకంగా మహానాడు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐటీడీపీ విభాగం.. రానున్న రోజుల్లో అధినేత చంద్రబాబు పర్యటనలు, పార్టీ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వర్చువల్ రియాలిటీలో ఎన్టీఆర్‌ని దగ్గరగా చూస్తూ.. కళ్లెదుటే ఆ మహనీయుడితో ఉన్న అనుభూతితో అభిమానులు పరవశించిపోతున్నారు.
ఐటీడీపీ డిజిటల్ విభాగం దేశంలోనే తొలిసారిగా సోషల్ మీడియా వేదికలు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వర్చువల్ లైవ్ వచ్చే విధంగా త్వరలోనే దీనిని తీర్చిదిద్దుతున్నారు. సంవత్సరం పాటు జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో 'ఎన్టీఆర్ లివ్స్ ఆన్' అనే కార్యక్రమం ద్వారా గత మూడేళ్లలో రాష్ట్రంలోని పరిస్థితులను వివరించేలా డిజైన్ చేస్తున్నారు. తెలుగుదేశం సామాన్య కార్యకర్తలకు కూడా సామాజిక మాధ్యమాలపై అవగాహన కల్పించడానికి ఐటీడీపీ శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తోంది.
ఇవీ చదవండి: